సమకాలీన రాజకీయాల్లో రాజకీయ పార్టీ నడపడం అంటే కష్టంతో కూడుకున్న పనే కావొచ్చు. కోట్లాది రూపాయల జూదంగా రాజకీయం మారిన క్రమంలో జనసేన పార్టీ భవిష్యత్ లో ఎలా ముందుకు వెళుతుంది అనేది చూడాలి.
ఎన్నికల సమరంలో నిర్మాణం లేకుండా 7% శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకున్న జనసేన.. ఎన్నికల అనంతరం కొద్దిగా స్తబ్దుగా మారిందని చెప్పకతప్పదు. కానీ ప్రజల చూపు మాత్రం జనసేన వైపే ఉంది. తమకు ఏ సమస్య వచ్చినా 39% ఓట్లు సాధించిన టీడీపీ వైపు కాక.. జనసేన తలుపు తట్టడం గమనించాల్సిన విషయం.
దానికి ఆయా సందర్భాలలో పవన్ కళ్యాణ్ స్పందించినపుడు ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలుకు దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
కానీ రాష్ట్రంలో ఇటీవలే కురిసిన భారీ వర్షాల వల్ల రైతులకు జరిగిన అపార నష్టం, మళ్లీ మొదలైన ఇసుక కొరత, అధోగతి పాలైన రోడ్ల అంశంపై జనసేన పార్టీ తన శ్రేణులకు ఏ విధమైన కార్యాచరణ ఇవ్వకపోవడం అనేది విచారించవలసిన అంశం. టీడీపీ వీటిపై స్పందించినా ప్రజల్లో అనుకున్న స్థాయిలో మద్దతు రావడం లేదు. లోకేష్ నాయకత్వంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించినా స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది.
ప్రజల తరపున పోరాడటానికి జనసైనికులు సిద్ధంగా వున్నా.. వారికి దిశానిర్దేశం చేసే స్థానిక నాయకత్వం లేకపోవడం వలన పార్టీకి పెద్దగా మైలేజ్ రావడం లేదు. గత కొంతకాలంగా సామాన్య ప్రజల్లో జనసేన విధానాలు బలంగా వినిపించే అవకాశాలు ఉన్నా పార్టీ అధినాయకత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఆ పార్టీకి నష్టం కలిగించే అంశం.
ముఖ్యంగా పవన్ కల్యాణ్ పర్యటనలు ఆగిపోవడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ తగ్గింది. కరోనా మరియు చతుర్మాస దీక్ష వల్ల ఇటువంటి పరిస్థితి తలెత్తినా ఈ ఖాళీ సమయాన్ని పార్టీ నిర్మాణం కోసం ఉపయోగించి జిల్లాల వారీగా నాయకత్వ భాద్యతలు ఇస్తే బావుండేది.
కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు చురుకుగా పని చేస్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలహీనంగా ఉండటంతో వారు కూడా నిరుత్సాహం చెందుతున్నారు. పార్టీలో చేరిక కోసం కొంతమంది నాయకులు ప్రయత్నాలు చేస్తుంటే పార్టీ వర్గాల నుంచి సరైన ప్రోత్సాహం రావడం లేదని వారు తిరిగి మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ శూన్యతని జనసేన పార్టీ సరిగ్గా వినియోగించుకుంటే రాబోయే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది అనడం లో ఎలాంటి సందేహం లేదు..