ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయింది. పర్సు లేకుండా బయటకు వెళ్లే వారు ఉంటారేమో కానీ ఫోన్ లేకుండా అడుగు బయట పెట్టారు. అంతలా మన జీవితంలో పెనవేసుకుపోయింది స్మార్ట్ ఫోన్. అయితే మీ భాగస్వామి మీతో కంటే ఫోన్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని అందరిలానే మీకు కూడా అనిపిస్తోందా? ఇలా అనిపించడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.
సైబర్మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) సహకారంతో వివో ఇండియా వివాహిత జంటలపై ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనంలో లెక్కకు మించిన భారతీయ జంటలు (69%) తమ స్మార్ట్ఫోన్ల కారణంగా పరధ్యానంలో ఉంటున్నారని, దీని కారణంగా వారు తమ భాగస్వామి విషయంలో తగినంత శ్రద్ధ చూపలేకపోతున్నారని అంగీకరించారు. ఈ అధ్యయనంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం.
అధ్యయనంలో పాల్గొన్న 70% మంది వ్యక్తులు తాము ఫోన్లో బిజీగా ఉన్నప్పుడు వారి జీవిత భాగస్వామి ఏదైనా అడిగినప్పుడు కొన్నిసార్లు చిరాకు పడతామని అంగీకరించారు. 90% మందికి స్మార్ట్ఫోన్ ఎంతో సౌకర్యవంతంగా సమయాన్ని గడపడానికి ఇష్టపడే మార్గంలా మారింది, 88% మందికి ఖాళీ సమయంలో ఫోన్లో గడపడం అనేది తమ ప్రవర్తనలో ఒక భాగంగా మారిందని పేర్కొన్నారు.
అందరూ ప్రతిరోజూ సగటున 4.7 గంటలు స్మార్ట్ఫోన్లలో గడపడానికి బహుశా ఇదే కారణం కావచ్చు. భార్యాభర్తల గురించి చెప్పుకుంటే.. 66% మంది స్మార్ట్ఫోన్ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల తమ జీవిత భాగస్వామితో తమ సంబంధం తగ్గిందనే విషయాన్ని అంగీకరించారు. అయితే ఈ అలవాటును మానుకోవడం సవాలుతో కూడుకున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి.